◀️ ▶️
సరస్వతి వందనము
యాకుందేందు తుషారహార ధవళా యా శుభ్ర వస్త్రావృతా
యావీణావరదండ మండిత కరా, యాశ్వేత పద్మాసనా!
యాబ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిః దేవైః సదా వందితా
సా మాం పాతు సరస్వతీ, భగవతీ నిస్సేషజాడ్యాపహా !!
ఏ మహాదేవి మల్లెమొగ్గ వలె, చంద్రుని వలె మంచు తుంపురుల వలె, ముత్యముల హారము వలె, తెల్లని కాంతులతో ప్రకాశించునో, శుభ్ర వస్త్రమును ధరించినదో, వీణాప్రాణియై ఒప్పుచున్నదో, తెల్లతామర పూవును ఆసనముగ స్వీకరించి విరాజిల్లుచున్నదో, బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతా సమూహములచే నిత్యము పూజలందుకొనుచున్నదో అన్ని విధములైన జాడ్యములను (అలసత్వములను) (అజ్ఞానము) తొలగించుటలో సమర్థురాలో అట్టి విశేషశక్తియుక్తురాలును భాగవతియునగు, సరస్వతీమాత నన్ను రక్షించుగాక!
శ్లో౹౹
శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆధ్యాం జగద్వ్యాపినీం
వీణాపుస్తక ధారిణిమభయదాం, జాడ్యాంధకారాపహామ్!
హస్తే స్ఫాటిక మాలికాం విదధతీం, పద్మాసనే సంస్థితాం
వందేతాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదామ్!!
తెల్లని స్వచ్ఛమైన వర్ణముతో ప్రకాశించునదియు బ్రహ్మతత్వ విచారమునందు సారమయమైన ఉన్నత స్వరూపమైయున్నదియు, చరాచరజగత్తునకు మూల స్థానమైనదియు, సకల జగములు వ్యాపించినదియు ఒకచేత వీణ ఒకచేత పుస్తకము కలిగి ప్రకాశించునదియు, అజ్ఞానము అలసత్వము అను చీకట్లను పారద్రోలు అభయ ముద్రతో మరియొక చేయి ఒప్పుచున్నదియు, ఒకచేత స్ఫటికమాల ధరించినదియు, పద్మాసనమున విరాజిల్లునదియు, మంచి బుద్ధి నొసంగినట్టియు షడ్గుణైశ్వర్యసంపన్నురాలు పరమేశ్వరియునగు సరస్వతిమాతను గూర్చి నమస్కరించుచున్నాను.