◀️ ▶️
శ్రీ ఆంజనేయ దండకము
నాగవల్లి దళాలతో (తమలపాకులు) అర్చన మారుతికి ప్రీతికరము. మరియు అరటి తోటలో పూజ కోటిరెట్ల ఫలితం ఇస్తుంది.
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కాయం౹ ప్రకీర్తి ప్రదాయం౹ భజేహం పవిత్రం౹ భజే సూర్యమిత్రం౹ భజేరుద్రరూపం౹ భజే బ్రహ్మతేజం౹ బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీనామసంకీర్తనల్ చేసి నీరూపు వర్ణించి నీ మీదనే దండకంబొక్కటిన్ జేయ సూహించి నీమూర్తి గావించి నీ సుందరం బెంచి నీ దాస దాసుండనై౹ రామభక్తుండనై౹ నిన్నునే గొల్చెదన్౹ నీ కటాక్షంబునన్ జూచితే వెడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవనిన్నెంచ నేనెంతవాడన్౹ దయా శాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరం బిల్చితే తొల్లి సుగ్రీవుకున్మంత్రివై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి సర్వేశు పూజించి యబ్భానుజం బంటు గావించి యవ్వాలినిన్ జంపి కాకుత్స్థ తిలకం దయాదృష్టి వీక్షించి కిష్కింధ కేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్౹ లింకిణిన్ గొట్టియున్౹ లంకయుం గాల్చియిన్౹ భూమి జన్ జూచి యానందముప్పొంగ యూయుంగరంబిచ్చి యా రత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతుష్టునిన్ చేసి౹ సుగ్రీవునిన్ అంగదున్ జాంబవంతాది నీలాదులం గూడియా సేతువున్దాటి వానరుత్మాకలై పెన్ముకలై దైత్యులం ద్రుంచగా౹ రావణుం డంత కాలాగ్ని యుగ్రుండునై పోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తినన్ వేసి యాలక్ష్మణున్ మూర్ఛ నొందింపగా, నప్పుడే బోయి సంజీవియందెచ్చి సౌమిత్రి కిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాళితో పోరి చెండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ౹ నవ్వేళలన్ న వ్విభీషణు, న్వేడుకన్ దోడుకన్వచ్చి పట్టాభిషేకంబు జేయించి౹ సీతా మహాదేవినిన్ శ్రీరాముకున్నిచ్చి యాయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరున్ గూర్చిలేరంచు మన్నించనన్ సేవించి రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తన ల్జేసితే పాపముల్బాయునే భయములున్దీరునే భాగ్యముల్గల్గునే సకల సామ్రాజ్యము ల్సకల సంపత్తులన్ గల్గునే వానరాకార యో భక్తమందార యో పుణ్య సంచార యో వీర యోశూర నీవే సమస్తంబు నీవే మహా ఫలమ్ముగా వెలసి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠించుచున్ స్థిరముగా వజ్రదేహంబు నుం దాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్ మనః పూతమై ఎప్పుడున్ తప్పకన్ తులతునా జిహ్వాయం దుండి నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్ర కల్లోల హావీర హనుమంత౹ ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూతప్రేత పిశాచ శాకినీ ఢాకిని గాలి దయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీ ముష్టి ఘాతంబులం బాహుదండంబులం రోమ ఖండంబులం ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాభాసి తంబైన నీ దివ్య తేజంబునున్ జూపి రారోరి నా హృదయ నరసింహ యంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే! వాయుపుత్రా నమస్తే నమస్తే నమో నమః౹
( ఈ దండకమును నిష్టతో పఠించినట్లయిన సర్వపాపములు నశించును. భయబాధలుండవు. భాగ్యములు గలుగును. భూతప్రేత పిశా చోరగా శాకిని ఢాకినీ గాలి దెయ్యంబులు దగ్గరకు చేరవు నిద్రించునపుడు దిండు క్రింద ఉంచుకొన్నచో దుస్వప్నములు రావు.)