కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని ఎందుకు పిలుస్తారు?
◀️ త్రిపుర సంహారమూర్తి ▶️
శివపుత్రుడైన స్కందుడు తారకాసురుని సంహరించాడు. అతనికి ముగ్గురు కుమారులు తారకాక్షుడు, కమలాక్షుడు, మరియు విద్యున్మాలి. వీరు ముగ్గురూ ఘోర తపస్సును ఆచరించి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకున్నారు. వారికి అజరం (ముసలితనం లేకపోవడం) అమరం (మరణం లేకపోవడం) ప్రసాదించమన్నారు. బ్రహ్మ ఒప్పకోలేదు. జన్మనెత్తిన ప్రతివాడికీ మరణం తప్పదనీ, మరేదైనా కోరుకోమని చెప్పాడు. వారు బాగా ఆలోచించి తమ ముగ్గురికి త్రిపురములను ప్రసాదించమని ప్రార్థించారు. బ్రహ్మ వెంటనే దేవశిల్పి మయుడిని పిలిచాడు. వీరి ముగ్గురికీ మూడు లోకాల్ని సృష్టించమని ఆదేశించాడు. చూస్తుండగానే మయుడు అద్భుతమైన మూడు నగరాలను నిర్మించాడు. అవి బంగారంతో, వెండితో, ఇనుముతో నిర్మించబడ్డాయి. పురములలో విశాలమైన రహదారులు, ఎత్తైన భవనాలు, ఆలయాలు, నదులు, వేదపాఠశాలలు, దిగుడుబావులు, అద్భుతమైన ఉద్యానవనాలు - ఇలా మూడు మహా సామ్రాజ్యాలనే సృష్టించాడు. ముగ్గురూ చక్కగా మూడు పురములలో ప్రవేశించి సుఖంగా ఉన్నారు. అవి శతృదుర్భేద్యమైనవి. కానీ ఎవ్వరికీ హాని తలపెటరాదని మయుడు ముగ్గురిని హెచ్చరించాడు.
ఈ త్రిపురాలు గాలిలో ఎగురుతూ ఉంటాయి. ఎక్కడి నుండి ఎక్కడికైనా ఎగిరి వెళ్ళవచ్చు. ఎక్కడైనా దిగవచ్చు. అపరాలు ఆకాశంలో ఎగురుతూ, ఎక్కడబడితే అక్కడ కిందకి దిగుతూ చాలా ప్రాణనష్టాన్ని కలిగించేవి. ప్రజలు చాలా కష్టాలు పడసాగారు. బ్రహ్మకు మొరపెట్టుకుని తమ బాధలు చెప్పకున్నారు. ఆయన వారితో కలిసి విష్ణువు వద్దకెళ్ళాడు. ఆ త్రిపురాసురులను సంహరించే శక్తి ఒక్క శివుడికే ఉందని చెప్పగా అంతా కలిసి కైలాసానికి చేరుకున్నారు. పరమేశ్వరుడు వారిని సంహరించడానికి అనువైన సమయం కోసం ఎదురు చూడాలని, ఆ మూడు పురాలూ ఒకే కక్ష్యలోకి చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని, వారు ముగ్గురినీ పురాలతో (త్రిపురాలతో) సహా నాశనం చేయాలని చెప్పాడు. ఆరోజు రానే వచ్చింది.... వారిని సంహరించడానికి దేవతలు తమలోని బలాన్ని శివుడికి ధారాదత్తం చేశారు. నాటి నుండి శివుడు మహాదేవుడయ్యాడు.
ఇక త్రిపుర సంహారానికి భూమి - రథంగా మారింది.
ఆ రథానికి సూర్యుడు, చంద్రుడు రెండు చక్రాలుగా,
బ్రహ్మ - సారధిగా,
నాలుగు వేదాలు - నాలుగు గుర్రాలుగా,
మేరుపర్వతం దివ్యకార్ముకం (ధనుస్సు)గా,
ఆదిశేషుడు ఆ విల్లుకు అల్లెత్రాడుగా,
విల్లుకి బాణంగా స్వయంగా విష్ణువే నిలిచాడు.
ప్రళయ కాలాగ్ని కీలలు ఆకాశమంతా నిండుతుండగా పరమేశ్వరుడు బాణాన్ని గురిచూసి వదిలాడు. త్రిపురాలు సరిగ్గా ఒకే వరుసలోకి వచ్చేసరికి ఆ బాణం మూడు పురాలను ఛేదించింది. ముగ్గురు రాక్షసులు పురములతో సహా నాశనమై పోయారు. అందరూ జయజయ ధ్వానాలు చేశారు. స్వామి త్రిపురసంహారసమయం అనంతరం తాండవం చేశాడు. ఈ తాండవానికే త్రిపుర తాండవం అనే పేరొచ్చింది. ఈ త్రిపురాసుర సంహారం జరిగింది కార్తిక పౌర్ణమిరోజు. అందుకే ఈ పౌర్ణమికి త్రిపురపూర్ణిమ అనికూడా పేరు.
Latest topics 🔔 |
---|
👉 యుగాలు అనగా నేమి? తెలుగు వ్యాకరణం |
👉 బ్రహ్మపుత్రానది స్టోరీ. |
👉 హనుమాన్ పుట్టిన ప్రదేశం. |
👉 జ్యోతిర్లింగాలు - జ్యోతి యొక్క మహిమ. |
👉 భీమవరం మావుళ్ళమ్మ temple స్టోరీ |
ఇతర స్తోత్రాలు 🙏 |
---|